Droupadi Murmu: ఆరోగ్యకరమైన భారతదేశం మనందరికీ కావాలి 5 d ago
ప్రతీ రోగికీ సేవలందించాలని, ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి అన్నారు. మంగళవారం మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుతున్నా అని..ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలన్నారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరూ దానిపై దృష్టి పెట్టాలన్నారు. సమయం, పరిస్థితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని రాష్ట్రపతి సూచించారు.
యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలని చెప్పారు. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉన్నారని, మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలని అన్నారు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్ గా మీరందరూ గుర్తుంటారని వివరించారు. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమని అన్నారు. 'మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాను అని రాష్ట్రపతి అన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే మన ధ్యేయం అని చెప్పారు. ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.